: ఫిఫా 'గోల్డెన్ బాల్' ఎవరికి దక్కేనో.. ?
ఫిఫా వరల్డ్ కప్ లో అత్యుత్తమ ఆటగాడికిచ్చే గోల్డెన్ బాల్ అవార్డు కోసం తుదిజాబితా ఖరారైంది. ఈ జాబితాలో నలుగురు జర్మన్లు, ముగ్గురు అర్జెంటీనా ప్లేయర్లు, బ్రెజిల్, కొలంబియా, నెదర్లాండ్స్ నుంచి ఒక్కొక్కరు స్థానం సంపాదించారు. జర్మనీ నుంచి మాట్ హమ్మెల్స్ (డిఫెండర్ ), ఫిలిప్ లామ్ (రైట్ బ్యాక్), టోనీ క్రూజ్ (మిడ్ ఫీల్డర్), థామస్ ముల్లర్ (ఫార్వర్డ్)... అర్జెంటీనా తరఫున లయొనెల్ మెస్సీ (ఫార్వర్డ్), ఏంజెల్ డి మారియా (వింగర్), జేవియర్ మషెరానో (మిడ్ ఫీల్డర్)... కొలంబియా నుంచి జేమ్స్ రోడ్రిగ్వెజ్ (అటాకింగ్ మిడ్ ఫీల్డర్)... బ్రెజిల్ సూపర్ ఫార్వర్డ్ నేమార్, డచ్ హీరో ఆర్జెన్ రాబెన్ లు ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో రోడ్రిగ్వెజ్ 6 గోల్స్ తో అగ్రస్థానంలో ఉన్నాడు. అర్జెంటీనా కెప్టెన్ లయొనెల్ మెస్సీ 4 గోల్స్ తో కొనసాగుతున్నాడు. అయితే, మెస్సీ ఫైనల్ ఆడనుండడంతో అతను మరిన్ని గోల్స్ సాధించిన పక్షంలో 'గోల్డెన్ బాల్' చాన్సులు మెరుగవుతాయి. ఇక, జర్మనీ హీరో థామస్ ముల్లర్ 5 గోల్స్ ఖాతాలో వేసుకున్నాడు. ఫైనల్లో జర్మనీ ఆడనుండడంతో మొగ్గు ముల్లర్ వైపే కనిపిస్తోంది. కాగా, గాయంతో టోర్నీ నుంచి వైదొలిగిన నేమార్ 4 గోల్స్ సాధించాడు. ఇక, బెస్ట్ గోల్ కీపర్ కు ఇచ్చే 'గోల్డెన్ గ్లోవ్' అవార్డు కోసం మాన్యువల్ న్యూర్ (జర్మనీ), సెర్గియో రొమెరో (అర్జెంటీనా), కీలర్ నవాస్ (కోస్టారికా) రేసులో ఉన్నారు. అర్జెంటీనా ఫైనల్ ఆడనుండడంతో రొమేరోకు అవార్డు గెలిచే చాన్సులెక్కువగా ఉన్నాయి.