: రాణించిన టీమిండియా బౌలర్లు...ఇంగ్లాండ్ 205/7


ట్రెంట్ బ్రిడ్జ్ లో ఇంగ్లాండ్ తో జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు సత్తా చూపారు. పేలవమైన పిచ్ అంటూ ఇంగ్లాండ్ బౌలర్లు క్యూరేటర్ పై విమర్శల వాన కురిపించిన చోట... నిస్సారమైన పిచ్ గా విశ్లేషకుల వివరణలకు అందని పిచ్ గా పేరుగాంచిన చోట భారత్ బౌలర్లు రాణించి బౌలింగ్ విభాగంపై ఆశలు రేపారు. భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరు 43/1 తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ రాబ్సన్ (59), బేలెన్స్ (71) అర్ధసెంచరీలు సాధించడంతో నిలదొక్కుకుందని భావించారు. ఆ సమయంలో ఇషాంత్ శర్మ వారిద్దరినీ పెవిలియన్ బాటపట్టించాడు. అనంతరం బెల్ (25)ను చక్కటి బంతితో అవుట్ చేశాడు. ఇక మిగిలిన పని భువీ, షమీ చూసుకున్నారు. టీమిండియా ముగ్గురు బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ క్రీజులో కదిలేందుకు ఇబ్బంది పడ్డారు. ఇషాంత్ శర్మ (3), భువనేశ్వర్ కుమార్ (2), మహ్మద్ షమి (2) లయ అందుకోవడంతో కెప్టెన్ ధోనీ హర్షం వ్యక్తం చేశాడు. కాగా, రూట్ (13), బ్రాడ్ (1) క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News