: బాబు పాదయాత్రలో.. తమ్ముళ్ళు విహారయాత్రలో..


ప్రజల కష్టాలకు స్పందించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తుంటే.. తెలుగు తమ్ముళ్ళు జాలీగా విదేశాలకు వెళ్ళినట్టు కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు నడుంనొప్పి, కాలి మడమనొప్పితో తీవ్రంగా బాధపడుతున్న సంగతి తెలిసిందే. విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయనను వైద్యులు నేడు మరోసారి పరీక్షించి తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కానీ బాబు పాదయాత్ర కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నారు.

బాబు ఇక్కడ ఇంతలా శ్రమిస్తుంటే, కొందరు టీడీపీ ఎమ్మెల్సీలు, నేతలు ఇండోనేసియా టూర్ వెళ్ళడంపై పలు విమర్శలు చెలరేగుతున్నాయి. రాజేంద్రప్రసాద్, లక్ష్మీనారాయణ, చిగురుపాటి వరప్రసాద్, చినరాజప్ప తదితరులు ఇండోనేసియాలోని బాలి ద్వీప యాత్రకు చెక్కేశారట. ఈ విషయమై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు.

తమ నేతలు అక్కడి పరిస్థితులు పరిశీలించేందుకే వెళ్ళారని తెలిపారు. ఆ అధ్యయనం పార్టీకి ఉపయోగపడుతుందని సోమిరెడ్డి చెప్పారు. వారి సొంత ఖర్చులతోనే ఇండోనేసియా పయనం అయ్యారని ఆయన వెల్లడించారు. కాగా,ఈ విహారయాత్రకు మహిళా నేత నన్నపనేని రాజకుమారి, మస్కతి, దాడి తదితరులు వెళ్ళాల్సి ఉన్నా చివరి నిమిషంలో వాయిదావేసుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News