: అరుణ్ జైట్లీతో భేటీ అయిన జగన్
ఢిల్లీలో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత జగన్ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో సమస్యలు, కేంద్రం చేపట్టాల్సిన చర్యలను జగన్ ఆయనకు వివరించినట్టు సమాచారం. ఈ మేరకు ఆయనకు విజ్ఞాపన పత్రం సమర్పించారు. లోటు బడ్జెట్ తో ఉన్న ఏపీలో మౌలిక సదుపాయాల కొరత ఉందని జగన్ పేర్కొన్నారు. ఐటీ కార్యకలాపాలు ఏపీలో నామమాత్రంగానే ఉన్నాయన్న ఆయన, తక్షణం ఐటీ పారిశ్రామిక కేంద్రంగా ఏపీని తయారు చేయాలని జైట్లీకి సూచించారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన రాజధానిని ఆంధ్రప్రదేశ్ లో నిర్మించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలను 15 ఏళ్లపాటు కొనసాగించి, పన్నుల మినహాయింపు ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు, విశాఖ మెట్రో రైల్, విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రోపాలిటన్ అర్బన్ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ఆర్ధిక మంత్రికి సూచించారు.