: ఒక్క అధికారి కోసం ఆర్డినెన్సా?: మోడీ తీరుపై కాంగ్రెస్ మండిపాటు
కేవలం ఒకే అక్క అధికారి కోసం ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ పార్టీ మోడీ సర్కారుపై మండిపడుతోంది. గతంలో ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ) చైర్మన్ గా పనిచేసిన నృపేంద్ర మిశ్రాను ప్రధాని కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా నియమించుకునేందుకు మోడీ సర్కారు ఏకంగా ట్రాయ్ చట్టంలో ప్రత్యేకంగా ఆర్డినెన్స్ ను ప్రతిపాదించింది. ప్రతిపాదించిన ఆరు నెలల్లోగా పార్లమెంట్ ఉభయ సభలు దీనికి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమావేశాల్లోనే ఈ ఆర్డినెన్స్ ను సభలో ప్రవేశ పెట్టేందుకు మోడీ సర్కారు సిద్ధమవుతోంది. దీంతో ఆర్డినెన్స్ ను కేవలం ఒక్క అధికారి కోసం ఎలా ప్రతిపాదిస్తారంటూ కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని ఉభయ సభల్లో తప్పనిసరిగా అడ్డుకుంటామని ఆయన చెప్పారు. 1967 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన మిశ్రా, 1990లలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కళ్యాణ్ సింగ్ కు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లో భాగంగా పలు కీలక బాధ్యతలు చేపట్టారు. టెలికాం, వాణిజ్య శాఖలకు కార్యదర్శిగానూ వ్యవహరించారు. అనంతరం ట్రాయ్ చైర్మన్ గా పనిచేశారు. ట్రాయ్ చైర్మన్ గా పనిచేసిన అధికారి ఆ తర్వాత కేంద్రంలో ఎలాంటి అధికారిక పదవి చేపట్టకూడదని ట్రాయ్ చట్టం చెబుతోంది. అయితే మిశ్రాకు మార్గం సుగమం చేసేందుకే మోడీ సర్కారు ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. బయట ఇంత తతంగం జరుగుతుంటే, మోడీ ప్రధాని పదవి చేపట్టకముందే, మిశ్రా మాత్రం మేలోనే ప్రధాని కార్యాలయంలో విధుల్లో చేరిపోయారు.