: బడ్జెట్టు భేషుగ్గా ఉంది...ఆంధ్రా, తెలంగాణ తప్ప ఇంకేం లేదా? వెంకయ్యనాయుడు


అరుణ్ జైట్లీ ప్రతిపాదించిన బడ్జెట్ భేషుగ్గా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, విమర్శలు చేసేవారు చేస్తూనే ఉంటారని అన్నారు. సంపద పెరగకుండా కేటాయింపులు ఎలా సాధ్యమో విమర్శలు చేసేవారు చెప్పాలని ఆయన కోరారు. బడ్జెట్ దేశం మొత్తానికి సంబంధించినదని, దేశం అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే కాదని మిగిలిన 27 రాష్ట్రాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రల్లో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నానని ఆయన చెప్పారు. వాటిని సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఇరిగేషన్ అనేది సమస్య కాదని, రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్న విధంగా కేటాయింపులు ఉంటాయని ఆయన తెలిపారు. విభజన బిల్లులో పేర్కొన్న ప్రతి హామీని నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ధరల పెంపుపై ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. సంపదను సృష్టించడం చాలా కష్టమైన పని అని ఆయన పేర్కొన్నారు. సంపదంటూ ఉంటే దానిని పంచడం కష్టం కాదని ఆయన తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. బడ్జెట్లో జనాకర్షణ కంటే దేశ ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక, నిర్మాణ, మౌలిక సదుపాయరంగం పుంజుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సామాన్యులపై భారం పడకుండా పన్నుల వసూళ్లు సమర్థవంతంగా చేస్తామని ఆయన తెలిపారు. సంపన్నవర్గాలపై పన్నులు వేశామని చెప్పిన ఆయన, తన శాఖకు సంబంధించిన ప్రతి హామీ నెరవేర్చేందుకు వంద శాతం కృషి చేస్తానని అన్నారు. బాధ్యతా రాహిత్యంగా ఎవరు వ్యవహరిస్తున్నారో దేశప్రజలందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ చేసిన ప్రతి విమర్శకు సమాధానం చెప్పాలా? అని తిరిగి ప్రశ్నించారు. పోలవరం తెలంగాణ, ఆంధ్ర ప్రాజెక్టు కాదని, జాతీయ బహుళార్థసాధక ప్రాజెక్టు అని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా చిత్తశుద్ధితో పోలవరం పూర్తి చేస్తామని వెంకయ్యనాయుడు తెలిపారు.

  • Loading...

More Telugu News