: బ్రెజిల్ ఓటమికి ఆ దేశ అధ్యక్షురాలిని విమర్శిస్తున్న ఫ్యాన్స్


ఫుట్ బాల్ అభిమానుల చేష్టలు కొన్ని సందర్భాల్లో విపరీతంగా ఉంటాయి. తమ జట్టు గెలిస్తే ఆటగాళ్లను ఆకాశానికి ఎత్తేయడం... ఓడిపోతే ఆటగాళ్లకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తం చెయ్యడం వారికి పరిపాటే. అయితే, తాజాగా బ్రెజిల్ అభిమానులు ఈ విషయంలో మరో అడుగు ముందుకేశారు. వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఓడినందుకు తమ జట్టు ఆటగాళ్లను నిందించడమే కాకుండా ఆ దేశ అధ్యక్షురాలు డిల్మా రూసెఫ్‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బ్రెజిల్ అభిమానులు. బ్రెజిల్ ఘోర పరాభవం తర్వాత... మ్యాచ్ జరిగిన బెలో హారిజాంటేలోని ఎస్టాడియో మినెరవో స్టేడియం వద్ద అభిమానులు గుమిగూడి బ్రెజిల్ అధ్యక్షురాలు డిల్మా రూసెఫ్‌ను విమర్శిస్తూ నినాదాలు చేశారు. మ్యాచ్ తర్వాత వీరిని చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ క్యానన్లను ఉపయోగించాల్సి వచ్చింది. అయినా కంట్రోల్ కాకపోవడంతో... చివరకు పోలీసులు లాఠీ ఛార్జి కూడా చెయ్యాల్సి వచ్చింది. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదేనేమో! కాగా, వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో జర్మనీ చేతిలో బ్రెజిల్ పరాజయాన్ని ఎదుర్కోవడంపై ఆ దేశ అధ్యక్షురాలు డిల్మా రూసెఫ్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఫలితాన్ని తాను ఊహించలేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్రెజిల్ ఓటమి తనకు బాధ కలిగించిందని, ఎంతో నిరుత్సాహం చెందానని తెలిపింది. గెలుపోటములు ఆటలో భాగమని... అభిమానులు సంయమనంతో ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. అయితే, ఈ ఓటమి మిగిల్చిన బాధను అధిగమించి బ్రెజిల్ జట్టు మళ్లీ రాణించాలని సూచించారు.

  • Loading...

More Telugu News