: ఐఐఎం కేటాయింపులో తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యి
రాష్ట్ర విభజన సమయంలో ఐఐటీలతో్ పాటు ప్రతిష్ఠాత్మక ఐఐఎం విషయంలోనూ ఇరు రాష్ట్రాలకు తగిన న్యాయం చేస్తామన్న కేంద్రం హామీలు నీటి మూటలుగానే మారాయి. గురువారం నాటి బడ్జెట్ లో భాగంగా దేశంలో కొత్తగా ఐదు చొప్పున ఐఐటీలు, ఐఐఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వాటిలో గతంలో ప్రకటించిన ఐఐటీని ఏపీకి కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.అయితే ఐఐఎంల కేటాయింపులో మాత్రం తెలుగు రాష్ట్రాలను విస్మరించారు. విభజనకు ముందే తెలంగాణ ప్రాంతంలోని మెదక్ జిల్లాలో ఐఐటీని ఏర్పాటు చేశారు. విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ కు కూడా ఓ ఐఐటీని కేంద్రం ప్రకటించింది. ఐఐఎంల కేటాయింపులో మాత్రం ఎప్పడూ తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతూనే వస్తోంది. తాజా కేటాయింపుల్లోనైనా ఐఐఎం ఇరు రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలోనైనా ఏర్పాటవుతుందన్న తెలుగోడి ఆశలు అడియాసలే అయ్యాయి.