: నెలాఖరులోగా ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయండి: కేజ్రీవాల్ కు నోటీసులు
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఈ నెలాఖరులోగా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేసింది. కొంత కాలం క్రితం జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీఎం పీఠం దక్కించుకున్న కేజ్రీవాల్, కొద్ది రోజుల వ్యవధిలోనే సీఎం పీఠాన్ని కూడా త్యజించేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీ ప్రభుత్వం ఆయనకు తిలక్ లేన్ లో అధికారిక నివాసాన్ని కేటాయించింది. అయితే పదవి నుంచి తప్పుకోవడంతో 15 రోజుల పాటు ఉచితంగానే అందులో నివసించిన కేజ్రీవాల్, ఆ తర్వాత నెలకు రూ. 80 వేలు అద్దె చెల్లిస్తూ అదే నివాసంలో కొనసాగుతూ వస్తున్నారు. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం సదరు నివాసాన్ని ఖాళీ చేయాల్సిందేనని తాఖీదులు పంపింది. ఈ నెలాఖరులోగా నివాసాన్ని ఖాళీ చేయాలన్న ఢిల్లీ సర్కారు తాఖీదుల నేపథ్యంలో కేజ్రీవాల్ సతీమణి, తమకు ప్రభుత్వ క్వార్టర్ ను కేటాయించాల్సిందిగా రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెలఖరులోగా తన నేత కుటుంబం ఇదివరలో నివాసమున్న ప్రాంతానికే తరలివెళ్లనున్నట్లు ఆప్ నేత ఒకరు చెప్పారు.