: లోక్ సభలో తెలుగు ’యువ‘ గళం
లోక్ సభలో గురువారం తెలుగు యువ గళం మారుమోగింది. టీడీపీ, వైఎస్సార్సీపీలకు చెందిన యువ ఎంపీలు నిత్యావసరాల ధరల అంశంపై జరిగిన చర్చలో చురుగ్గా పాల్గొన్నారు. టీడీపీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్ లోటు బడ్జెట్, రుతుపవనాల రాక ఆలస్యం కావడం తదితర అంశాలపై మాట్లాడారు. తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తొలి యత్నంలోనే లోక్ సభకు గుంటూరు స్థానం నుంచి ఎన్నికయ్యారు. అదేవిధంగా తొలిసారి లోక్ సభలో ప్రసంగించిన ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండానే తన ప్రసంగాన్ని కొనసాగించారు. మరోవైపు వైఎస్సార్సీపీ తరఫున అరకు నుంచి ఎన్నికైన కొత్తపల్లి గీతకు కూడా లోక్ సభలో ప్రవేశం ఇదే తొలిసారి. అయినా ధరల నియంత్రణకు సంబంధించి ఆమె ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. తెలుగు యువ ఎంపీలు మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ స్థానంలో తెలుగు ఎంపీ కొనకళ్ల నారాయణ ఉండటం గమనార్హం!