: ఈ పుల్లలు పెట్టుడేంది కేసీఆర్?: ఎర్రబెల్లి
రాష్ట్ర విభజన నాడే కేంద్రం కొన్ని విధివిధానాలు రూపొందించిందని, వాటికి అనుగుణంగా నడుచుకోవడం నేర్చుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు హితవు పలికారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, "అన్నదమ్ముల్లా విడిపోదాం అని చెప్పింది మాటల వరకేనా? చేతల్లో కాదా?" అంటూ మండిపడ్డారు. "ఇద్దరన్నదమ్ముల్లో ఒకరు కష్టపడి పైకి వస్తానంటుంటే సాయం చేయాల్సింది పోయి ఈ పుల్లలు పెట్టుడేంది?" అంటూ కేసీఆర్ ను నిలదీశారు. టీడీపీ, బీజేపీలపై బురదజల్లి రాజకీయ లబ్ది పొందుదామని చూస్తున్నారని, అది తప్ప కేసీఆర్ సాధించగలిగేది ఇంకేమీ లేదని ఆయన పేర్కొన్నారు. యుద్ధం చేయాలనుకుంటే ఎదురుబొదురుగా నిలబడి పోరాడాలి తప్ప, కుట్రలు, కుయుక్తులతో కాదని ఎర్రబెల్లి హితవు పలికారు. కేసీఆర్ అవాకులు చవాకులు తెలంగాణ ప్రజలకు అర్థం అయితే ఇక టీఆర్ఎస్ పని ముగిసినట్టేనని స్పష్టం చేశారు. విభజన ఏ రీతిన, ఏ ఒప్పందాల ప్రకారం జరిగిందో కేసీఆర్ కు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. అప్పుడు అన్నీ ఒప్పుకుని ఇప్పుడు తప్పుడు కూతలు కూయడం సరికాదని హితవు పలికారు. "తెలంగాణ సంప్రదాయం ప్రకారం చేతనైతే చేయూతనిద్దాం, అంతే కానీ, వాస్తవాలు విస్మరించి తప్పుడు ప్రచారం చేయడం తగదు" అని ఎర్రబెల్లి సూచించారు.