: రైల్వే పార్సిళ్లకూ డోర్ డెలివరీ
రైళ్లలో పార్సిల్ సర్వీసుల విషయానికొస్తే.., ఇప్పటిదాకా డోర్ డెలివరీ అన్న మాట వినలేదు. రైళ్లల్లో పార్సిల్ పంపాలంటే మనమే రైల్వే స్టేషన్ కు వెళ్లి పార్సిల్ అందజేయడంతో పాటు నిర్ణీత రుసుమును చెల్లించాలి. ఆ తర్వాత మనం ఎవరికైతే పార్సిల్ పంపామో సదరు వ్యక్తులు వారి సమీపంలోని రైల్వే స్టేషన్ కు వెళ్లి ఆ పార్సిల్ ను తీసుకోవాల్సి వచ్చేది. తాజాగా, రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ ప్రకటన కార్యరూపం దాల్చితే, మనం పంపిన పార్సిల్ ను నేరుగా మనం రాసిన చిరునామాకు రైల్వే సిబ్బందే చేర్చేస్తారు. మంత్రి సదానంద గౌడ మంగళవారం నాటి తన రైల్వే బడ్జెట్ ప్రసంగంలో ఈ అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. పార్సిళ్లనే కాక పెద్ద ఎత్తున సరుకు రవాణా చేస్తున్న వ్యాపార వర్గాలకు కూడా సౌలభ్యం కలిగించేలా సరికొత్త డిజైన్లతో పార్సిల్ వాహనాలను రంగంలోకి దించనున్నామని వెల్లడించారు. సరుకుల రవాణాలో వేగం పెంచేందుకు ప్రత్యేక ఫ్రైట్ కారిడార్లు ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. దేశంలో జరుగుతున్న సరుకుల రవాణాలో రైల్వేలు 30 శాతాన్ని మాత్రమే చేజిక్కించుకున్నాయని, సరికొత్త విధానాలతో తమ వాటాను పెంచుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తామని మంత్రి పేర్కొన్నారు.