: ఏకంగా ఏటీఎం మిషీన్ నే లేపేశారు!
ఎస్బీఐ ఏటీఎంలో నగదును దోచుకెళ్లేందుకు వచ్చిన దొంగలు అది ఎంతకీ తెరుచుకోకపోవడంతో ఏకంగా ఏటీఎం మిషీన్ నే ఎత్తుకెళ్ళిన ఘటన అసోంలో చోటుచేసుకుంది. కామరూప్ జిల్లా రంగియాలోని రైల్వే స్టేషన్ సమీపంలోని ఏటీఎంలో స్టేట్ బ్యాంకు అధికారులు 45 లక్షల రూపాయలు లోడ్ చేశారు. రద్దీ ప్రదేశంలో ఏటీఎం ఉండడంతో ఖాతాదారులు భారీ మొత్తంలో నగదు డ్రా చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో కొందరు దొంగలు వచ్చి డబ్బు దోచుకెళ్లేందుకు ప్రయత్నించారు. డబ్బులు రాకపోవడంతో ఏకంగా ఏటీఎం మెషీన్ ను తమతో తీసుకెళ్ళారు. ఏటీఎం మెషీన్ సరిగ్గా బిగించకపోవడం, దానికి తోడు ఏటీఎం కేంద్రం వద్ద భద్రత లేకపోవడంతో దొంగల పని సులువైందని పోలీసు అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో ఏటీఎంలో 5.38 లక్షల రూపాయలు ఉన్నాయని బ్యాంకు అధికారులు తెలిపారు. ఏటీఎంలో రికార్డయిన సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగలను వీలైనంత తొందర్లో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, గత నెలలో ఇదే పట్టణంలో ఓ ఏటీఎంను దొంగలు తీసుకెళ్లి అందులోని 25 లక్షల రూపాయలు స్వాహా చేసి ఏటీఎం మెషీన్ ను మురికి కాల్వలో పడేశారు.