: రాష్ట్ర ప్రజలు మోసపోయారు: ధర్మాన
రాష్ట్ర ప్రజలు మరోసారి మోసపోయారని వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో ఓటమి పాలైందని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తే భవిష్యత్ అధికారం మనదేనని అన్నారు. రాష్ట్ర ప్రజలు దొంగల పార్టీకి అధికారం అప్పగించారని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీతో పాటు రామోజీరావు కూడా దొంగే అని అన్నారు. బాబు వస్తే జాబు, రుణమాఫీ అంటూ వార్తలు ప్రచురించి రామోజీరావు ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు. ఇప్పుడు ప్రజలు త్యాగాలకు సిద్ధపడాలని అబద్దాలు చెబుతూ మరో అతిపెద్ద మోసానికి తెరతీశారని ఆయన మండిపడ్డారు. కొంత కాలం వేచి చూసి ఎదురుదాడి మొదలుపెడదామని ఆయన కార్యకర్తలకు సూచించారు.