: ఐటీ ఉద్యోగులే వీళ్ళ టార్గెట్!
పూణెలోని ఓ దొంగల ముఠా కేవలం ఐటీ ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతోంది. హింజేవాడి పోలీసులు నిన్న ఈ ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను అరెస్టు చేశారు. ఖాలిద్ అహ్మద్ షేక్, నితంత్ గిరీశ్ పవార్ అనే ఈ దొంగల ద్వయం నుంచి రెండు కార్లు, పలు మొబైల్ ఫోన్లు స్వాధీనపర్చుకున్నారు. కాగా, వీరిద్దరూ ఐటీ కంపెనీల్లో డ్రైవర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. రోడ్డు పక్కన ముంబయి వైపు లిఫ్ట్ అడిగే వారిని తమ కార్లలో ఎక్కించుకుని, ఆ తర్వాత వారిపై దాడి చేసి నగదు, నగలు దోచుకోవడం వీరి స్టయిల్. అనంతరం నిర్జన ప్రదేశంలో వారిని వదిలేసి పరారవుతారు. అయితే, కారు ఎక్కేముందు ఐడీ కార్డు చూపించమంటారు. ఐటీ ఉద్యోగులయితేనే కారు ఎక్కించుకుంటారు. ల్యాప్ టాప్ లు, ఖరీదైన ఫోన్లు, నగదు, బంగారు నగలు వంటి విలువైన వస్తువులు ఉంటాయనే వీరు ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా ఎంచుకుని దోపిడీలకు పాల్పడ్డారని జిల్లా ఎస్పీ భోసాలే తెలిపారు.