: ద్రావిడ్ ఉన్నాడు... ఇంగ్లండ్ ను కుమ్మేస్తాం: కోహ్లీ
గత ఇంగ్లండ్ పర్యటనకు ప్రతీకారం తీర్చుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ. 2011లో ఎదురైన వైట్ వాష్ కు ఈ సిరీస్ ద్వారా సమాధానం చెబుతామని స్పష్టం చేశాడు. ఆనాటి సిరీస్ లో పరుగుల వర్షం కురిపించిన బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు సలహాదారుగా తమ వెంట ఉన్నాడని, ఇక తమకు బ్యాటింగ్ సమస్యలు ఉండబోవని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఇక, ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్టు సిరీస్ ఆడుతున్న కోహ్లీ తన బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ, సుప్రసిద్ధ లార్డ్స్ లో టెస్టు ఆడనుండడం ఉద్విగ్నతకు గురిచేస్తోందని చెప్పాడు. వ్యక్తిగతంగా కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నానని, వాటి సాధనపై దృష్టి పెట్టానని తెలిపాడు.