: కోస్టల్ రైల్వే కారిడార్ పై ఏపీ దృష్టి... చంద్రబాబు ఒత్తిడి ఫలిస్తుందా?
ఎన్డీయే ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టబోతున్న రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు పెద్ద పీట వేస్తారా? ప్రధాని మోడీతో అత్యంత సాన్నిహిత్యం కలిగిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాష్ట్రానికి ఏ మాత్రం రాబట్టుకోగలుగుతారు? ఇప్పుడు అందరి మదిలో ఇవే ఆలోచనలు. అయితే, కోస్టల్ కారిడార్ ఏర్పాటు కోసం ఏపీ గవర్నమెంట్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కోస్టల్ కారిడార్ వస్తే... అన్ని పోర్టులను రైల్వేతో అనుసంధానం చేసే వీలుకలుగుతుంది. దీనికి తోడు, రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకు మెరుగైన రైల్వే కనెక్టివిటీ ఉంటుంది. రాష్ట్రంలో రవాణా వ్యవస్థ ఉన్నత స్థాయికి చేరుతుంది. దీంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే కోస్టల్ కారిడార్ కోసం చంద్రబాబు తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన ప్రాజెక్టులు ఇవే... * చిత్తూరు-కుప్పం (వయా పలమనేరు) మీదుగా మరో కొత్త రైల్వే లైను నిర్మాణం. 155 కి.మీ. ఈ లైను కోసం రూ. 1860 కోట్ల వ్యయం అవుతుంది. * కంభం-ఒంగోలు (వయా పొదిలి, చీమకుర్తి) మీదుగా రైల్వే లైను. 120 కి.మీ. పొడవైన ఈ లైనుకు రూ. 1320 కోట్ల ఖర్చు అవుతుంది. * ఓబుల్ వారిపల్లి-వాయల్పాడు మధ్య 110 కి.మీ. రైల్వే మార్గం. దీనికి రూ. 1290 కోట్ల బడ్జెట్ అవసరం అవుతుంది. ఈ మార్గంలో మరో ప్రధానమైన అంశం ఏమిటంటే... మార్గమధ్యంలో 18 కి.మీ. టన్నెల్ (సొరంగమార్గం) నిర్మించాల్సి ఉంటుంది. * నర్సారావుపేట-దర్శి మధ్య 73 కి.మీ. రైల్వే లైను నిర్మాణం. దీనికి రూ. 800 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ రైల్వే లైను నిర్మిస్తే తులిపాడు, వేముల, పాటిబండ, కారుమంచి, సంతమాగులూరులకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. * వీటికి తోడు... ఇప్పటికే కాకినాడ నుంచి కోటిపల్లి వరకు రైల్వే లైను ఉంది. కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు రైల్వే లైను మంజూరైనప్పటికీ నిధులు విడుదల కాలేదు. ఈ లైనును మరింత పొడిగిస్తే... కోస్టల్ కారిడార్ కు అనువుగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికితోడు, నర్సాపురం నుంచి మచిలీపట్నం వరకు కొత్త లైను నిర్మించాలని బాబు ప్రతిపాదనలు పంపారు. మొగల్తూరు, పేరుపాలెం, ఇంటూరు, కానూరు, గోకవరం మీదుగా ఈ లైను ఉంటుంది. 70 కి.మీ. పొడవైన ఈ కొత్త లైనుకు రూ. 840 కోట్ల నిధులు అవసరమవుతాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్రమైన సర్వే చేయించారు. కొద్ది రోజుల క్రితమే రైల్వే మంత్రి సదానందగౌడకు చంద్రబాబు ప్రతిపాదనలన్నింటినీ సమర్పించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచైనా సరే కోస్టల్ కారిడార్ ను సాధించుకోవాలనే దిశగా బాబు అడుగులు వేస్తున్నారు. మరి చంద్రబాబు ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు స్పందిస్తుందో తెలవాలంటే... మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.