: శరీరంలో ప్రొటీన్ల ఉత్పత్తి జన్యువులు 19 వేలే.
మానవ శరీరంలో ప్రొటీన్లను ఉత్పత్తి చేసే జన్యువుల సంఖ్య 19 వేలేనని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఈ జన్యవులే శరీరంలో కణాలు, జీవ క్రియలకు అవసరమైన ఆదేశాలిస్తాయని స్పానిష్ నేషనల్ కేన్సర్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలినాళ్లలో ఈ తరహా జన్యువులు దేహంలో లక్షకు పైగానే ఉన్నాయన్న అభిప్రాయాలుండేవి. అయితే కొంతకాలం క్రితం వెల్లడైన జన్యుపటం (జీనోమ్) ఆధారంగా శరీరంలో ప్రొటీన్ ఉత్పత్తి జన్యువులు 20,700 మాత్రమే ఉన్నాయని తేలింది. అయితే వీటిలో కూడా 1,700 జన్యువులకు ఈ పనులతో ఏమాత్రం సంబంధం లేదని వెల్లడైంది. తాజా పరిశోధనల ప్రకారం దేశంలో ప్రొటీన్ల ఉత్పత్తికి కేవలం 19,000 జన్యువులు మాత్రమే దోహదపడుతున్నాయని వెల్లడైనట్లు ’హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్‘ జర్నల్ లో ప్రచురితమైన పరిశోధన కథనం తెలిపింది. ఈ జన్యువులు కూడా మానవుడి పూర్విక జాతుల నుంచే సంక్రమించాయని చెబుతున్న పరిశోధకులు, జన్యవుల సంఖ్య తగ్గేకొద్దీ మరింత విస్తృతంగా పరిశోధనలు సాగించే వెసులుబాటు చిక్కినట్లేనని బలంగా వాదిస్తున్నారు.