: లోపల... వెలుపలా.. నిరసనల వెల్లువ
ధరల పెరుగుదల అంశం మోడీ ప్రభుత్వానికి ఇటు పార్లమెంట్ ఉభయ సభల్లోనే కాక సభ వెలుపల కూడా నిరసనల వెల్లువతో స్వాగతం పలికింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజే మోడీ ప్రభుత్వంపై విపక్షాలు ముప్పేట దాడి చేశాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో తొలిరోజు ప్రశ్నోత్తరాలకు అవకాశమే లేకుండా పోయింది. లోక్ సభ ప్రారంభం కాగానే ధరల పెరుగుదలపై ప్రత్యేకంగా చర్చ జరపాలంటూ అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దీంతో ఎలాంటి ప్రొసీడింగ్స్ లేకుండానే సభ వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఈ అంశంపై చర్చ జరపాలన్న పలు పార్టీల అభ్యర్థన మేరకు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమ్మతం తెలపడంతో నేరుగా చర్చే ప్రారంభమైంది. ఇక పార్లమెంట్ వెలుపల పలు పార్టీల కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు. జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు కిలో మీటరు మేర ర్యాలీ నిర్వహించారు. ధరలను ఇష్టారాజ్యంగా పెంచిన మోడీ సర్కారు వైఖరిపై కాంగ్రెస్ నేతలతో పాటు బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా మండిపడ్డారు.