: చక్కని విందు భోజనంతో... ‘నాటా’ సభలు ఆరంభమయ్యాయ్
ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ద్వైవార్షిక మహాసభలు అట్లాంటాలోని జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో నాటా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రేమ్ రెడ్డి, డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిలతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. భారత్, అమెరికా నుంచి విచ్చేసిన అతిథులతో సభా ప్రాంగణం కళకళలాడింది. ప్రముఖ గాయని సునీత వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో అమెరికాలోని చిన్నారులు ప్రదర్శించిన మహాగణపతిం నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి నాటా కార్యవర్గం పురస్కారాలను అందజేసి, సత్కరించింది. అనంతరం సునీత, మాళవిక, గోపికా పూర్ణిమల సంగీత విభావరి వీక్షకులను అలరించింది. ప్రారంభ కార్యక్రమంలో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.