: కాంగ్రెస్ లో సమూల మార్పులు జరగాలంటున్న పార్టీ నాయకులు
2014 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ఓటమిని చవిచూడటంతో పార్టీలో విభేదాలు ఒక్కసారిగా బహిరంగమయ్యాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులందరూ పార్టీలో సమగ్ర మార్పులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలపై పలువురు తీవ్ర ఆగ్రహంతో విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పై వచ్చిన అవినీతి ఆరోపణలే ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణమని భావిస్తున్నారట.
మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ నుంచి పోటీచేసి ఓడిన అక్కడి కాంగ్రెస్ నేత మహాబల్ మిశ్రా మాట్లాడుతూ, షీలా దీక్షిత్ ప్రజల్లోకి సరైన సందేశాన్ని పంపలేకపోవడమే హస్తం ఓటమికి ఓ కారణంగా చెబుతున్నారు. అంతేకాక ఆమె అహంకారి అని వ్యాఖ్యానించారు. పార్టీ అగ్రనేతలంతా ఢిల్లీ విద్యుత్ సమస్య విషయంలో సరిగా వ్యవహరించలేకపోయారని వెల్లడించారు. ఇలా కేవలం ఒక్క ఢిల్లీలోనే కాదట, మహారాష్ట్ర నాయకుల్లోనూ ఇలాంటి అసంతృప్తే నెలకొని ఉందని వినికిడి.
సీఎం పృథ్వీరాజ్ చవాన్ నాయకత్వంపై రాష్ట్ర నాయకులు ఆగ్రహంగా ఉన్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చెబుతోంది. ఇక బీహార్ లో ఆర్జేడీతో పొత్తు విషయంలో ఆలస్యం, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నాయకుల మధ్య చిన్నపాటి ఘర్షణలు, ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ అధిష్ఠానం దారుణంగా విభజించడం... ఇలాంటి కారణాలన్నీ ఓటమికి ప్రధాన కారణాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.