: కామన్ వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్టు... కాపీ కొడుతూ దొరికిపోయాడు


కామన్ వెల్త్ గేమ్స్ లో దేశ ప్రతిష్ఠ పెంచిన గోల్డ్ మెడలిస్టు కాపీ కొడుతూ పట్టుబడిపోయాడు. మహారాష్ట్రకు చెందిన రెజ్లర్ (కుస్తీ వీరుడు), అర్జున అవార్డు గ్రహీత నర్సింగ్ యాదవ్ కామన్ వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించాడు. అతని లక్ష్యం పోలీస్ అధికారి కావడం. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం అతడికి డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీసు స్థాయి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు అతనికి ప్రత్యేకంగా రెండేళ్లు నాసిక్ లోని పోలీస్ అకాడమీలో శిక్షణ కూడా ఇచ్చింది. శిక్షణాంశాల్లో ఉత్తీర్ణుడైన యాదవ్, రాత పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడ్డాడు.
దీంతో పరీక్షల పర్యవేక్షణాధికారి అతడ్ని బయటకు పంపించారు. అతను డిప్యూటీ సూపరిండెంట్ కావాలంటే 13 పేపర్లలో ఉత్తీర్ణుడు కావాల్సి ఉండగా, నాలుగో పరీక్షలో ఈ దురదృష్టకర అంశం చోటు చేసుకుంది. దీంతో అతని భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. పోలీసు శాఖ తీసుకునే నిర్ణయంపై అతని భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాగా, నర్సింగ్ యాదవ్ పోలీసు ఉన్నతాధికారుల విచారణ ఎదుర్కోనున్నాడు.

  • Loading...

More Telugu News