: ‘పేకాట పాపారావు’లకు అదిరిపోయే ఆఫర్!
హైదరాబాదులో ఇంతకు ముందు జూదరులతో పేకాట క్లబ్ లు కళకళలాడేవి. పేరున్న క్లబ్స్ లో సభ్యత్వం లక్షల రూపాయలకు చేరిందంటే క్లబ్స్ లకు ఉన్న ఆదరణను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నగరంలో చిరాన్ పోర్ట్, సెలబ్రిటీ, జీవీకే... ఇలా డజనుకు పైగా క్లబ్ లు నడిచేవి. అయితే, తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ క్లబ్స్ ను మూసివేయాలని ఆదేశించడంతో పరిస్థితి మారిపోయింది. నిన్నటిదాకా కళకళలాడిన క్లబ్బులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. హైదరాబాదు క్లబ్బులు మూతపడటంతో కేసినోల ఏజెంట్ల కన్ను ఇక్కడి ‘పేకాట పాపారావు’లపై పడింది. 'కొలంబోకి వచ్చి ఆడుకోండి' అంటూ ఆఫర్స్ అందిస్తున్నారు. ఆటకు ఆట, మజాకు మజా... ఎందుకంటే మధ్యలో థాయ్ మసాజ్ లున్నాయిగా! దాంతో ఇప్పుడు మన వాళ్లంతా కొలంబోకు క్యూ కడుతున్నారు. హైదరాబాదు నుంచి చెన్నైకి, అక్కడి నుంచి శ్రీలంకకు పయనమవుతున్నారు. లక్షల రూపాయలను తీసుకెళుతున్న పేకాట ప్రియులు అక్కడకు చేరేవరకూ ఆ బాధ్యత అంతా కేసినో క్లబ్ దే. పేకాట ప్రియులకు మందు, స్టార్ ఎకామిడేషన్, కార్లు, మసాజులు అన్నీ ఫ్రీ. అయితే కొలంబో కేసినోలలో డాలర్లు అవసరం కనుక క్యాష్ ఎక్ఛేంజ్ బాధ్యతను కూడా ఏజెంట్లే తీసుకుంటున్నారు. హైదరాబాదు నుంచి కొలంబో వెళుతున్న వారంతా రోజుకు 2.3 కోట్లు ఇండియన్ కరెన్సీని తీసుకెళుతున్నారు.