: బీజేపీతో శివసేన పొత్తు బలంగానే ఉంది: ఉద్ధవ్ థాకరే
మహారాష్ట్ర ప్రాంతీయ పార్టీ శివసేనతో పొత్తుకు బీజేపీ ముగింపు పలకబోతోందంటూ వస్తున్న వార్తలను సేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఖండించారు. అక్టోబర్ లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నేతలు పొత్తునుంచి బయటికి రావాలనుకుంటున్నారన్న వ్యాఖ్యలను కూడా ఆయన కొట్టిపారేశారు. కమలంతో తమ పార్టీ పొత్తు బలంగా, చెక్కుచెదరకుండా ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు ముంబయిలో ఓ పుస్తక ఆవిష్కరణలో మాట్లాడిన థాకరే... బాల్ థాకరే, అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్.కె.అద్వానీల సమయం నుంచీ రెండు పార్టీల అలయెన్స్ కొనసాగుతూ వస్తోందని పేర్కొన్నారు. ఒకవేళ దీనిపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నిస్ తనతో మాట్లాడితే అధికారికంగా పరిశీలిస్తానని చెప్పారు.