: కళ్ల ముందే భార్య నలిగిపోయింది... ఇక ఎవరి కోసం బతకాలి?


ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య కళ్ల ముందే శిథిలాల కిందపడి నలిగిపోయింది. మరదలు, పిల్లనిచ్చిన మామ భూమిలో కూరుకుపోయారు... ఇక తను ఎవరికోసం బతకాలి? అంటూ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం గుడివాడ గ్రామానికి చెందిన చుక్క మహేష్ భోరున విలపిస్తున్నాడు. చెన్నైలో 11 అంతస్తుల అపార్ట్ మెంట్ కూలిన సంగతి తెలిసిందే. భవనం కూలిన మూడు రోజుల తరువాత మృత్యుంజయుడిగా స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డ మహేష్ జరిగిన దారుణానికి సజీవ సాక్షి.
అతను వెల్లడించిన వివరాల ప్రకారం... ప్రాణంగా ప్రేమించి గత ఫిబ్రవరి 14న హైదరాబాదులో పెళ్లి చేసుకున్న భార్య సుజాతతో కలసి అత్తమామలను చూసేందుకు జూన్ 27వ తేదీన మహేష్ చెన్నై వెళ్లాడు. ప్రమాదం జరిగిన అపార్ట్ మెంట్ లో అతని అత్త, మామలు కూలీలుగా పని చేస్తున్నారు. 28వ తేదీ గ్రౌండ్ ఫ్లోర్ లో కూర్చుని కష్టసుఖాలు మాట్లాడుకుంటుండగా రెప్పపాటులో భూమిలోకి కూరుకుపోయారు.
అంతే షాక్ తో స్పృహ కోల్పోయారు. తెలివి వచ్చేసరికి తమపై బలమైన ఇనుప గొట్టాలు, వాటిపై సిమెంటు ఫలకాలు పడి ఉన్నట్టు గ్రహించాడు మహేష్. తన భార్య, తాను బతికి ఉండడంతో దేవుడికి కృతజ్ఞత తెలుపుకున్నాడు. పక్కనే వాటర్ క్యాన్ పడి ఉండడం గమనించాడు. అప్పటికే దాహంతో ఉండడంతో గొంతు తడుపుకుందామని దానిని అందుకున్నాడు. అంతే, జరగరాని ఘోరం జరిగిపోయింది.
దానిని ఆధారం చేసుకుని ఉన్న సిమెంటు దిమ్మెలు తన భార్య పై పడిపోయాయి. ఎంత బరువు పడిందో కానీ కళ్ల ముందే ఆమె నలిగిపోయింది. తాను బతికినా తన కళ్ల ముందే భార్య నలిగిపోయింది, చూస్తుండగానే మామ, మరదలు భూమిలో కూరుకుపోయారు. ఇంకా ఎవరికోసం బతకాలి? అంటూ నిర్లిప్తత వ్యక్తం చేస్తున్నాడు. అతని అత్త ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

  • Loading...

More Telugu News