: కాలిఫోర్నియా స్థానాన్ని ఆక్రమించుకునే దిశగా బెంగళూరు


ఇప్పటిదాకా గ్లోబల్ ఐటీ హబ్ గా విలసిల్లుతున్న కాలిఫోర్నియా స్థానాన్ని ఇకపై బెంగళూరు కైవసం చేసుకునే రోజులు మరెంతో దూరంలో లేవు. ఐటీలో కొత్తగా కంపెనీలు నెలకొల్పుతున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు బెంగళూరు బాట పడుతుండటమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సిలికాన్ వ్యాలీలో కొత్తగా కంపెనీ పెట్టాలంటే, అందుకయ్యే వ్యయప్రయాసలు అన్నీ ఇన్నీ కావు. అంతే కాక సదరు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల వీసా తదితరాలకయ్యే ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయట. ఈ కారణాల వల్లే కొత్త కంపెనీలు పెట్టాలనుకునే ఔత్సాహికులు బెంగళూరు బాట పట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో నెలలో కనీసం పది కొత్త కంపెనీలు బెంగళూరులో కార్యకలాపాలు మొదలుపెడుతున్నాయి. వీటిలో ఏడు నుంచి తొమ్మిది దాకా ఐటీ, ఈ- కామర్స్, గేమింగ్ విభాగాలకు చెందినవే కావడం గమనార్హం. తాజా గణాంకాల ఆధారంగా దశాబ్దంలోగానే బెంగళూరు గ్లోబల్ ఐటీ హబ్ కిరీటాన్ని దక్కించుకోవడం ఖాయమని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో 2014 జనవరి నుంచి 2015 జనవరిలోగా 10 వేల కొత్త కంపెనీల ఏర్పాటుకవసరమయ్యే వేదికను నాస్ కామ్ సిద్ధం చేసింది. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో పనిచేసి, కొత్తగా కంపెనీలు ప్రారంభించిన పలువురు ఔత్సాహికులు బెంగళూరు వేదికగా కంపెనీలను ప్రారంభించడమే కాక, అనతి కాలంలోనే ఊహించని రీతిలో కంపెనీల నెట్ వర్త్ ను పెంచేస్తున్నారు.

  • Loading...

More Telugu News