: మళ్లీ పార్టనర్లు కాబోతున్న సల్మాన్, గోవింద!
ఆరు సంవత్సరాల తర్వాత బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, గోవింద మళ్లీ పార్టనర్లు కాబోతున్నారు. ఏదో బిజెనెస్ కోసం అనుకోకండి.. ఓ చిత్రం కోసమే! 2005లో వీరిద్దరూ డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన 'పార్టనర్' చిత్రంలో నటించారు. అనంతరం ఏ చిత్రంలోనూ కలిసి నటించేందుకు అవకాశం రాలేదు. ఈ క్రమంలో సల్మాన్ తనదైన వేగంతో ఇతర చిత్రాల్లో నటిస్తుండడం, గోవిందాకు అంతగా అవకాశాలు లేకపోవడం తెలిసిన సంగతే.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇద్దరూ ఓ చిత్రంలో నటించనున్నారని బాలీవుడ్ వర్గాల కథనం. హిందీ దర్శకుడు మహేష్ మంజ్రేకర్ మరాఠీ భాషలో 'ఆజ్ ఛా దివస్ మజ్హా' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో సల్మాన్, గోవింద కలిశారు. ఈ సమయంలో మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్టులో వారు నటించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు పూర్తిస్థాయి స్క్రిప్టు తయారుచేసిన అనంతరం ఈ విషయం ప్రకటించనున్నారని సమాచారం. ప్రస్తుతం గోవింద 'అవతార్' అనే రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు.