: స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ సమస్య తెచ్చిన చిక్కు
ట్రాఫిక్ జామ్ లు ఆ స్కూల్ కు తీవ్ర ఇబ్బందిని తెచ్చిపెడుతున్నాయి. విపరీతమైన ట్రాఫిక్ కారణంగా విద్యార్ధులు సకాలంలో చేరలేకపోతుండటంతో చేసేదేమీ లేక స్కూల్ కు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. దీంతో సిలబస్ సకాలంలో పూర్తి కాక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీహార్ లోని పాట్నాకు సమీపంలోని జెతులీనగర శివారులోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ వద్ద ఎప్పుడూ ట్రాఫిక్ రద్దీ నెలకొంటుంది. దీంతో ఉదయం 7.15 నిమిషాలకు స్కూల్ కు చేరాల్సిన విద్యార్ధులు ట్రాఫిక్ జామ్ కారణంగా బస్సులు ఇరుక్కుపోయి 11.30 గంటల వరకు చేరలేకపోతున్నారు. వారిని 12.10 గంటలకు వెనక్కి పంపగా వాళ్లు ఇంటికి చేరే సరికి సాయంత్రం 5 గంటలైందని స్కూలు సిబ్బంది చెబుతున్నారు. దీంతో బస్సులో పిల్లలు కూర్చోలేక ఏడుపు అందుకుంటున్నారని బస్సు డ్రైవర్ వెల్లడించారు. కాగా, ఈ నగరం హైవేని ఆనుకుని ఉండడంతో ట్రాఫిక్ జామ్ లు సర్వసాధారణమని ట్రాఫిక్ పోలీసులు వ్యాఖ్యానించారు. దీంతో స్కూల్ విద్యార్ధులు ట్రాఫిక్ లో చిక్కుకుని ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ట్రాఫిక్ అధికారులను విద్యాశాఖాధికారులు ఆదేశించారు.