: అక్షరాలా చిరంజీవి, సల్మాన్ ఖాన్ చెప్పినట్టే చేస్తున్నారు


మెగాస్టార్ చిరంజీవి నటించిన 'స్టాలిన్' సినిమా చూశారా? పోనీ హిందీలో బాలీవుడ్ మాస్ కింగ్ సల్మాన్ ఖాన్ నటించిన 'జైహో' సినిమా చూశారా? ఆ రెండు సినిమాల్లో చెప్పింది ఒకటే. ఎవరి వద్దనుంచయినా సాయం పొందితే మీరు ప్రతిఫలం ఆశించకుండా మరో ముగ్గురికి సాయం చేయండి, వారిని కూడా అలాగే సాయం చేయమని చెప్పండి, వారు మరో ముగ్గురికి సాయం చేస్తారు. అలా ప్రపంచం మొత్తం సాయం చేసేవారితో నిండిపోయి... ప్రజలు సమస్యలు లేకుండా జీవిస్తారని చిరు, సల్లూభాయ్ సినిమాలో చెబుతారు.

అదే ఫార్ములాను బీహార్ లోని ఖైమూర్ జిల్లా అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీతో కలిసి ఫాలో అయిపోతున్నారు. వారు ప్రారంభించిన ఆ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలోని ప్రతి కుటుంబం నుంచి పది రూపాయల వంతున సాయం చేయాలి. అలా వసూలైన మొత్తంతో డబ్బులేక వైద్యం చేయించుకోలేకపోతున్న పేదలకు వైద్యమందిస్తున్నారు. వైద్య సౌకర్యాలు ఉండీ ప్రజలకు చేరువకావడం లేదని ఆలోచించిన అధికారులు ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుందని అమలు చేశారు.

అంతే వారి ఆలోచన ప్రజలకు నచ్చింది. దుర్వినియోగం చేయకుండా పేదలకు సాయం చేసేందుకు అందరూ ముందుకు వస్తున్నారని అధికారులు వెల్లడించారు. ప్రజలు అందించే ప్రతి పది రూపాయలకు కూపన్ అందజేస్తామని, అలా వసూలు చేసిన ప్రతి పైసాకి లెక్క చెబుతామని రెడ్ క్రాస్ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు, విరాళాల సేకరణను పర్యవేక్షించేందుకు బ్లాక్ డెవలప్ మెంట్ అధికారులను, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్స్ ను రెడ్ క్రాస్ అధికారులు సహాయం కోరారు.

  • Loading...

More Telugu News