: సినీ నటుల తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసహనం
ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహిస్తే దానికి తగినంత మంది సినీనటులు హాజరు కాకపోవడాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా హాజరైన నాగార్జున, మహేశ్ బాబు తదితర కొద్ది మంది నటులు కూడా మధ్యలోనే వెళ్లిపోవడంపై తన సన్నిహితులు, అధికారుల వద్ద ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
గురువారం హైదరాబాద్ లోని లలితకళాతోరణంలో ప్రభుత్వం ఉగాది పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించింది. దీనికి నాగార్జున, మహేశ్ బాబు, నయనతార, చార్మి, దర్శకుడు శ్రీను వైట్ల, శంకర్ మరికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. కార్యక్రమం పూర్తి కాకుండానే నాగార్జున, మహేశ్ బాబు అర్ధంతరంగా అక్కడి నుంచి జారుకున్నారు. కార్యక్రమం పూర్తయ్యేసరికి ఒక్కరూ లేరు. ఇదే వేదికపై విఖ్యాత నటుడు అమితాబ్ బచ్చన్ కు ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఉగాది పురస్కారాల కార్యక్రమం పూర్తయ్యే వరకూ అమితాబ్ అక్కడే ఉన్నారు. అదే సమయంలో తెలుగు నటీ నటులు వెళ్లిపోవడం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. దీనిని ఆయన సన్నిహిత మంత్రులు, అధికారుల వద్ద వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు కోరినన్ని రాయితీలు కల్పిస్తున్నా ప్రతిష్ఠాత్మక కార్యక్రమం విషయంలో నటీనటుల వైఖరి సరికాదని సీఎం అన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వ ప్రతిష్ఠను పలుచన చేస్తాయని అన్నట్లు సమాచారం.