: శిథిలాల నుంచి రక్షిస్తే, 'చెప్పులు ఏవి?' అని అడిగాడు!
చెన్నైలో భవంతి కూలిన ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద నుంచి పలువురు గాయాలతో బయటపడ్డారు కూడా. అక్కడ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో వెలికితీత కార్యక్రమాలు చేపట్టారు. ఆ సంస్థకు చెందిన 'రుస్తుం' అనే జాగిలం కాంక్రీట్ దిమ్మల కింద చిన్నరంధ్రంలో మూతి పెట్టి వాసన చూసి, అరవడం మొదలెట్టింది. దీంతో, అక్కడెవరో ప్రాణంతో ఉన్నారని దాని మాస్టర్ గుర్తించాడు. వెంటనే, లైఫ్ డిటెక్టర్లు, మెటల్ కట్లర్లు, కెమెరాలతో రంగంలోకి దిగి ఓ యువకుడిని సజీవంగా వెలికితీశారు. ఆ యువకుడు బయటకు వచ్చీరాగానే, "నా స్లిప్పర్స్ ఏవి?" అంటూ ప్రశ్నించేసరికి అధికారులు అవాక్కయ్యారు.
అతడిని ఒడిశాకు చెందిన వికాస్ కుమార్ గా గుర్తించారు. దాదాపు 72 గంటలపాటు మృత్యుముఖంలో గడిపివచ్చేసరికి అలా మాట్లాడుతున్నాడేమో? అని అధికారులు భావించారు. ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ వెంటనే అతగాడికి ఓ జత చెప్పులు తెప్పించారు. వారిచ్చిన ఓ బాటిల్ నీళ్ళు తాగి, ఆ చెప్పులేసుకుని, అసలేం జరగనట్టే అక్కడి నుంచి వెళ్ళిపోయాడట ఆ ఒడిశా యువకుడు.