: ఆర్థికవృద్ధిని పునరుద్ధరించాలంటే కఠిన నిర్ణయాలు తప్పనిసరి: అరుణ్ జైట్లీ
కాంగ్రెస్ పదేళ్ల పరిపాలనా కాలంలో ఆర్థికవృద్ధి గతి తప్పుతోందని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే వారంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, ఆర్థికవృద్ధిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే సమయం ఇదేనని అన్నారు. దేశానికి ఆర్థిక క్రమశిక్షణ కావాలో లేదా ప్రజాకర్షక పథకాల మీద అర్థం పర్థంలేని వ్యయం కావాలో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని జైట్లీ వివరించారు. దేశ వృద్ధిరేటు ఇప్పటికే మందగమనంలో ఉందన్న ఆయన, ద్రవ్యలోటు కూడా చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇక దేశంలో రుతుపవనాలు ఆశాజనకంగా లేవని, ఇరాక్ ప్రభావంతో చమురు ధరలు మండుతున్నాయనీ అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాకర్షక పథకాల మీద దృష్టి పెడితే ఖజనాపై భారం పెరిగిపోతుందని గుర్తు చేశారు.