: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మళ్లీ తెరుచుకున్నాయ్
బాబ్లీ ప్రాజెక్టు గేట్లు 8 నెలల అనంతరం మళ్లీ తెరుచుకున్నాయి. ఈ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల మధ్య వివాదం నడుస్తున్న విషయం విదితమే. దీనిపై గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ప్రతి సంవత్సరం అక్టోబరు 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30వ తేదీ వరకు ప్రాజెక్టు గేట్లను మూసివేసి ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జులై 1వ తేదీన గేట్లను తెరచి, అక్టోబరు 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం కలగకుండా చూడాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.