: జీసస్ ఉంటే 'గే' వివాహాలకు ఓకే చెప్పేవాడంటున్న పాప్ స్టార్
పాశ్చాత్య సంగీత ప్రపంచంలో సర్ ఎల్టన్ జాన్ (67) ది ప్రత్యేక స్థానం. పాప్, రాక్, జాజ్... అన్ని రకాల సంగీతాల్లోనూ ఆయనది అందెవేసిన చేయి. ఎల్టన్ జాన్ ఐదు దశాబ్దాల కెరీర్లో 300 మిలియన్లకు పైగా మ్యూజిక్ రికార్డులు అమ్ముడయ్యాయి. ఇదో రికార్డు. తాజాగా, ఆయన తన మనసులో మాట బయటపెట్టారు.
బ్రిటన్ కు చెందిన ఈ లెజెండరీ సింగర్ త్వరలోనే తన భాగస్వామి డేవిడ్ ఫర్నిష్ ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫర్నిష్ పురుషుడు కావడంతో అందరి దృష్టి ఇటు మళ్ళింది. ఈ నేపథ్యంలో ఎల్టన్ జాన్ మాట్లాడుతూ, ఏసుక్రీస్తు ఉంటే స్వలింగ సంపర్కుల వివాహాలకు మద్దతుగా నిలిచేవాడని పేర్కొన్నారు. జీసస్ జీవితమంతా ప్రేమ, దయతో కూడినదని, ఆయన ప్రజలను ఒక్కచోటకు చేర్చేందుకు ఎంతో శ్రమించారని తెలిపారు. చర్చిలు నేడు చేస్తున్నది అదేనని అన్నారు.