: ఉస్తాద్ అంజాద్ ఆలీ ఖాన్ 'సరోద్' మారింది
భారతీయ శాస్త్రీయ సంగీతకారుడు, పద్మ విభూషణ్ ఉస్తాద్ అంజాద్ ఆలీ ఖాన్ తన సరోద్ వాయిద్యం ద్వారా ఎంతోమంది సంగీత ప్రియులకు వీనుల విందు చేశారు. నలభై ఐదేళ్ల నుంచి దాంతోనే ఆయన సాన్నిహిత్యం కొనసాగుతోందంటే అతిశయోక్తి కాదు. అలాంటిది తాజాగా బ్రిటీష్ ఎయిర్ వేస్ ఫ్లైట్ లో లండన్ నుంచి ఢిల్లీకి ఆయన వస్తుండగా ఆ వాయిద్యం మారిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా ఉస్తాదే మీడియాకు వెల్లడించారు.
అయితే, బ్రిటీష్ ఎయిర్ వేస్ తన సరోద్ ను మార్చిందని ఆరోపిస్తున్నారు. తన సరోద్ కు బదులుగా వేరే సరోద్ ను అప్పగించారంటున్నారు. ఈ నెల 21న అక్కడి డార్టింగ్ టన్ కళాశాలలో రవీంద్రనాథ్ ఠాగూర్ జ్ఞాపకార్ధం జరిగిన ఉత్సవాల్లో పాల్గొనేందుకు తన భార్య సుబ్బలక్ష్మితో కలసి వెళ్లానని, తిరిగి 28న విమానంలో వస్తుండగా సరోద్ మాయమైందనీ ఉస్తాద్ పేర్కొన్నారు. తన విలువైన సరోద్ కోసం ఐదు గంటల పాటు ఎదురుచూసినా దొరకలేదని చెప్పారు. ఇప్పటికీ దానికోసం ఎదురు చూస్తున్నానని, అంత పెద్ద ఎయిర్ వేస్ సంస్థ నిర్లక్ష్యంగా ఎలా ఉంటుందని ఆయన మండిపడ్డారు.