: రాష్ట్రానికి 24 గంటల పాటూ విద్యుత్ ఇస్తాం: ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
రాష్ట్రానికి 24 గంటల పాటూ విద్యుత్ ఇచ్చేందుకు మంత్రివర్గం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. విద్యుత్ కొరత నివారించేందుకు సోలార్, విండ్ ఎనర్జీని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించామన్నారు. హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి సమావేశ వివరాలను మీడియాకు వివరించారు. త్వరలో డీస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన చెప్పారు. ఇక నుంచి 10 రోజులకొకసారి సమావేశమవ్వాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.
రాజమండ్రిలో మహా కుంభమేళా ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. ఐటీ పరిశ్రమ అభివృద్ధి కోసం సింగిల్ విండో విధానం ఉండాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. అన్ని జిల్లాలకు సమప్రాధాన్యం ఇవ్వాలని కూడా కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రాన్ని కోరునున్నట్లు పల్లె చెప్పారు.