: పాతవాటిని ఏరేసి... కొత్త రేషన్ కార్డులు జారీ చేయండి: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని, పనిలోపనిగా బోగస్ కార్డులను ఏరివేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 84 లక్షల కుటుంబాలు ఉండగా, కోటికిపైగా రేషన్ కార్డులు ఉన్నాయని అన్నారు. వీటిలో 91 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా, 15 లక్షల గులాబీ రంగు కార్డులతో పాటు, మరో 40 వేల అంత్యోదయ కార్డులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
ఈ లెక్కన కుటుంబాల సంఖ్య కంటే సుమారు 22 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అక్రమ రేషన్ కార్డులను ఏరివేయాలని అధికారులకు ఆయన సూచించారు. కాగా, ఉత్తర తెలంగాణలో పెట్రోల్ కొరతకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖను కేసీఆర్ ఆదేశించారు.