: ఇంటి నిర్మాణ అనుమతులన్నీ ఒకే చోట లభించేలా చర్యలు తీసుకుంటాం: కేటీఆర్
హైటెక్ సిటీ సమీపంలోని హైటెక్స్ ప్రాంగణంలో ఇండియా ప్రాపర్టీ డాట్ కామ్ ఆధ్వర్యంలో ‘గృహప్రవేశ్’ ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు ప్రారంభించారు. శని, ఆదివారాలు జరిగే ఈ ప్రదర్శనలో ఇంటి నిర్మాణ కంపెనీలు, రియల్ ఎస్టేట్స్ కంపెనీల స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇళ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీలో ఒకే చోట అన్ని రకాల అనుమతులు లభించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇళ్ల నిర్మాణ అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామన్నారు. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాదులో భూముల ధరలు తక్కువగా ఉన్నాయని, మౌలిక వసతులు కూడా ఇక్కడ బాగున్నాయని అన్నారు. హైదరాబాదులో మెరుగైన జీవన ప్రమాణాలను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని కేటీఆర్ చెప్పారు.