: ఇదో ట్రయాంగిల్ పెళ్లి స్టోరీ


ఇదో ట్రయాంగిల్ పెళ్లి స్టోరీ... పెద్దల సమక్షంలో ఒక పెళ్లి చేసుకున్న ఘనుడు, పోలీసుల సమక్షంలో ఇంకో పెళ్లి చేసుకుని పోలీసులకు చేతినిండా పని కల్పించాడు. వివరాల్లోకెళ్తే... విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని ఇప్పలవలసకు చెందిన కొండపల్లి సత్యనారాయణ టీచర్ గా పని చేస్తున్నాడు. ఇతను, అదే గ్రామానికి చెందిన చింత కల్యాణి ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ప్రియుడు పెళ్లి విషయం దాటవేస్తుండడంతో కల్యాణి ఆండ్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్సై వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, ఆమెను పెళ్లి చేసుకునేందుకు సత్యనారాయణ అంగీకరించాడు. దీంతో అదే రాత్రి 11:30 గంటలకు మెంటాడలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఇప్పలవలస ఎంపీటీసీ సభ్యుడు చింత కాశీనాయుడు, కొండలింగాలవలస మాజీ సర్పంచ్ తిరుపతి, మరి కొందరు పెద్దల సమక్షంలో వారికి వివాహం జరిపించారు.

ఇక్కడే ట్రయాంగిల్ పెళ్లి స్టోరీ మలుపు తిరిగింది. తన భర్తకు పోలీసులు మళ్లీ పెళ్లి చేశారని ఆరోపిస్తూ ఉపాధ్యాయిని భార్య లీగల్ సెల్ కి ఫిర్యాదు చేసింది. మే 1న విజయనగరంలోని నూకాలమ్మ ఆలయంలో తనకు సత్యనారాయణతో పెళ్లి జరిగిందని అదే మండలం పోరాం గ్రామానికి చెందిన టీచర్ వెంకటమ్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి సందర్భంగా తీసిన ఫోటోలను చూపించారు. సత్యనారాయణ తల్లిదండ్రులు నూతనంగా ఇల్లు నిర్మించుకునేందుకు ఈ నెల 18న భూమి పూజ చేశారని, ఆ కార్యక్రమంలో తాను కూడా పాల్గొన్నానని తెలిపింది.

ఆ ఇంటి స్థలం కూడా తన పేరుమీదే ఉందని వెంకటమ్మ వెల్లడించింది. తనపై, తన భర్తపై కల్యాణి లేనిపోని ఆరోపణలు చేసిందని వెంకటమ్మ వాపోయింది. దీంతో ఈ కేసుపై విచారణ చేయాల్సిందిగా బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ మహమ్మద్ ను ఎస్పీ ఆదేశించారు. దీంతో వెంకటమ్మ, కల్యాణి నుంచి వివరాలు సేకరించామని, దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు.

  • Loading...

More Telugu News