: సంబంధం చెడిపోతే అత్యాచారం అంటారా? ఇది పగ తీర్చుకోవడంలో భాగమా?: సుప్రీంకోర్టు ప్రశ్న
పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ మధ్య సంబంధం చెడిపోతే అత్యాచారం ఆరోపణలు చేసుకుంటారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఐడీఎఫ్ సీ బ్యాంకు ఉన్నతాధికారికి, ఓ అంతర్జాతీయ విమానయాన సంస్థ ఉద్యోగికి మధ్య ఉన్న సంబంధం చెడిపోయిన కేసు ఢిల్లీ హైకోర్టు ముందుకు వచ్చింది. ఆమె ఉన్నత విద్యావంతురాలని, ఇంటర్నెట్ వాడకం బాగా తెలుసని, తనకు పెళ్లై ఇద్దరు పిల్లలున్న విషయం కూడా ఆమెకు తెలుసని, దానిని దాచడం సాధ్యం కాదని, అందువల్ల తాను ఆమెను పెళ్లి చేసుకుంటానని లైంగిక సంబంధం పెట్టుకునే అవకాశం లేదని నిందితుడు కోర్టుకు తెలిపాడు.
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో సంబంధం పెట్టుకున్నాడని, తాము సన్నిహితంగా ఉన్న వీడియోలను ఇటర్నెట్ లో పెడతానని బెదిరించాడని బాధితురాలు గత ఏడాది చేసిన ఫిర్యాదు ఢిల్లీ హైకోర్టు ముందుకు విచారణకు వచ్చింది. దీంతో ఢిల్లీ హైకోర్టు ఈ కేసును సుప్రీంకోర్టుకు సిఫారసు చేస్తూ, పురుషుల మీద పగ తీర్చుకునేందుకు, బలవంతంగా ఓ వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అత్యాచారం కేసులను ఓ ఆయుధంలా ఉపయోగించుకుంటున్నారని వ్యాఖ్యానించింది.
దీనిపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ జిత్ సేన్, జస్టిస్ ఎస్ కే సింగ్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బాధితురాలిపై ప్రశ్నల వర్షం కురిపించింది. అలాంటి అసభ్య ఫోటో ఎందుకు తీయనిచ్చారని అడిగింది. సెల్ఫీ అయితే మొత్తం శరీరాన్ని ఫోటో తీయడం సాధ్యమేనా? అని ధర్మాసనం ప్రశ్నించింది. రెండేళ్లపాటు బంధం కొనసాగించి, అది చెడిపోయిన తరువాత అత్యాచారం అని ఎలా అంటారని నిలదీసింది.