: పీవీకి ఎన్ని అవార్డులిచ్చినా తక్కువే: సీఎం కేసీఆర్
మాజీ ప్రధాని దివంగత నరసింహారావు 93వ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. హైదరాబాదు నెక్లెస్ రోడ్డులోని పి.వి విజ్ఞాన భూమి వేదిక వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రానికి, దేశానికి పీవీ చేసిన సేవలను కొనియాడిన ఆయన, పీవీకి ఎన్ని అవార్డులిచ్చినా తక్కువే అవుతుందన్నారు. దేశంలో విప్లవాత్మకమైన మార్పులకు పీవీ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన జయంతి కార్యక్రమాలు ఇంత ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని, ఈసారి ఇంతకంటే పదిరెట్లు ప్రభుత్వం తరపున ఘనంగా జయంతి వేడుకలు చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. కాగా, పీవీ వంటి మహనీయుడు, స్థితప్రజ్ఞుడికి భారతరత్న ఇవ్వాలని కేబినెట్ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని కేసీఆర్ అన్నారు. పీవీ తమ తెలంగాణ ఠీవీ అని, ఆయనకు సమున్నత స్థానం కల్పించేలా త్వరలో ట్యాంక్ బండ్ పై విగ్రహం, పీవీ మెమోరియల్ భవన్ ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.