: మావోయిస్టులపై నిషేధం ఎత్తివేయాలి: కేంద్రానికి సీపీఐ విజ్ఞప్తి
వామపక్ష తీవ్రవాదం కంటే దేశంలో ఆర్థిక నేరాలు, మత హింస పెచ్చరిల్లిపోతుండగా, మావోయిస్టులపై నిషేధం సబబు కాదని సీపీఐ కేంద్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు నక్సల్స్ పై నిషేధం ఎత్తివేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు కె.నారాయణ విశాఖపట్నంలో మాట్లాడుతూ, కేంద్రం వామపక్ష తీవ్రవాదాన్ని సామాజిక ఆర్థిక సమస్యగా పరిగణించే బదులు శాంతిభద్రతల సమస్యగా చూడడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
కేంద్రంతోపాటు రాష్ట్రాలు కూడా బుల్లెట్ కు బుల్లెట్ తోనే సమాధానం అన్న రీతిలో వ్యవహరించడమే అశాంతికి కారణమని నారాయణ వివరించారు. ప్రభుత్వం మావోయిస్టులపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కేంద్రం వామపక్ష తీవ్రవాదాన్ని సామాజిక ఆర్థిక సమస్యగా భావించి తక్షణమే చర్చలకు ఉపక్రమించాలని, తద్వారా భూ పంపిణీ వ్యవహారాలు పరిష్కరించాలని కోరారు.