: ఉన్న వనరులతోనే అదుపు చేశారు... అప్పటికే చాలా నష్టం జరిగింది: ఫైర్ డీజీ
అందుబాటులో ఉన్న వనరులతోనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారని ఫైర్ డీజీ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రమాదం జరిగిందని సమాచారం రాగానే రాజోలు, మామిడికుదురు ఫైర్ స్టేషన్లను అప్రమత్తం చేశామని అన్నారు. వారు వెంటనే వెళ్లి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని ఆయన చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలపాటు తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పగలిగినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గ్యాస్ కావడం వల్ల ఊహించనంత వేగంతో చుట్టుపక్కలకు మంటలు వ్యాపించాయని ఆయన తెలిపారు. దీంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా సంభవించిందని ఆయన చెప్పారు. ఉభయగోదావరి జిల్లాల్లో గ్యాస్ పైప్ లైన్లు ఉన్న దృష్ట్యా ప్రభుత్వం కొనుగోలు చేసిన 5 ఫోమ్ టెండర్స్ ఆ జిల్లాలకే కేటాయిస్తామని ఆయన వెల్లడించారు.
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా, సంభవించినా ఓఎన్జీసీ, గెయిల్ ల సహకారం లేకుండా అగ్నిమాపక సిబ్బందే ప్రజల ప్రాణాలు కాపాడేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కాసేపట్లో సంఘటనా స్థలిని సందర్శించి నష్టం వివరాలపై అంచనాకి వస్తామని ఆయన చెప్పారు.