: విశాఖ అమ్మాయికి ర్యాంకుల పంట!
ఎంబీబీఎస్ లో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా నిర్వహించే 'ఎయిమ్స్-2014' పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. మొదటి రెండు ర్యాంకుల్లోనూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన అమ్మాయిలు నిలిచారు. అదీ జాతీయ స్థాయిలో ర్యాంకులు దక్కించుకోవడం విశేషం. ఇందులో తొలి ర్యాంకు ఏపీలోని విశాఖకు చెందిన శ్రీవిద్య సాధించి రికార్డు సృష్టించింది. రాష్ట్రానికి ఈ రికార్డు దక్కడం ఇదే తొలిసారి.
విశాఖపట్నం సీతమ్మధార బాలయ్యశాస్త్రి లేఅవుట్ ప్రాంతానికి చెందిన శ్రీవిద్య తండ్రి పీవీఎస్ ప్రసాద్, తల్లి రాజ్యలక్షి. తండ్రి ఎస్ బీఐలో మేనేజర్ గా, తల్లి కెనరా బ్యాంకులో క్లర్కుగా పని చేస్తున్నారు. శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఆమె ఇంటర్మీడియట్ పూర్తిచేసి 984 మార్కులు సాధించింది. అనంతరం రాసిన ఎంసెట్ లో 7వ ర్యాంకు, ఏఐపీఎంటీలో 59వ ర్యాంకు దక్కించుకుంది. ఇక ప్రముఖ జిప్ మెర్ ప్రవేశ పరీక్షలో 8వ ర్యాంకు, మణిపాల్ ప్రవేశపరీక్షలో 9వ ర్యాంకు సాధించింది. తన ర్యాంకుపై స్పందించిన శ్రీవిద్య, ఎయిమ్స్ ప్రవేశ పరీక్షలో తనకు ఏకంగా మొదటి ర్యాంకు వస్తుందని ఊహించలేదని ఆనందం వ్యక్తం చేసింది. ఢిల్లీ ఎయిమ్స్ లో చదవుతానని, పీజీలో కార్డియాలజీ చేసి వైద్య విద్యకు సంబంధించిన పరిశోధనలు చేయాలనేదే తన లక్ష్యమని తెలిపింది.
ఇక ఇదే పరీక్షలో విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన పోలిశెట్టి వశిష్ఠ రెండవ ర్యాంకు సాధించాడు. కొన్నాళ్ల నుంచి ఈ కుర్రాడి కుటుంబం హైదరాబాదులోనే స్థిరపడింది.