: లతా మంగేష్కర్ ఇక పాటకు దూరం
నిదురపో.. నిదురపో.. నిదురపోరా తమ్ముడా.. నిదురలోన గతమునంతా నిమిషమైనా మరచిపోరా కరుణ లేని ఈ జగాన కలతనిదురే వీడురా... అంటూ చిట్టి తమ్ముడిని నిదురపుచ్చేందుకు అక్క హృదయం నుంచి వెలువడిన జోలపాట. 'తెల్లచీరకు తకదిమి తపనలు రేగేనమ్మ' అంటూ ప్రియుడితో ఆడిపాడిన పాట. ఇలాంటి ఆణిముత్యాల భారీ వర్షం కురిపించిన ఆ స్వరం లతా మంగేష్కర్ సొంతం. భాషా భేదం లేకుండా హిందీ, తెలుగు, తమిళం ఇలా 36 భాషలలో తన గాత్రాన్ని వినిపించిన ఆ కమ్మని కోయిల ఇక కూయనని చెప్పేసింది.
సినీ, సంగీతాభిమానులకు రుచించని వార్తను లతామంగేష్కర్ వెల్లడించారు. పాటకిక న్యాయం చేయనని విరమణ తీసుకుంటున్నానని నిన్న ముంబైలో దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాల ప్రదానోత్సవంలో ప్రకటించారు. 13వ ఏట నుంచే పాడడం మొదలెట్టిన లత దాదాపు 25వేలకు పైగా పాటలతో భిన్న భాషలకు చెందినవారిని ఓలలాడించారు. 13వ ఏటే లత తన తండ్రిని కోల్పోవడం గమనార్హం. సంగీతానికి ఆమె చేసిన విశిష్ఠ సేవలకు గాను దేశంలోనే అత్యున్నత పురస్కారం భారతరత్న 2001లో లతా ను వరించింది. అంతేకాదు, పద్మవిభూషణ్, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే లాంటి ఎన్నో అవార్డులు ఆమెకు దాసోహమన్నాయి. ఎక్కువ పాటలు పాడిన గాయనిగా ఆమె పేరు గిన్నిస్ బుక్ లోనూ ఎక్కింది. అలాంటి తియ్యటి స్వరం ఇక నిదురలోన గతమునంతా గుర్తు చేస్తూనే ఉంటుంది.