: వచ్చే రెండు నెలల్లో ఏపీకి 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి: చంద్రబాబు
రానున్న రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ కు ఐదు వందల మెగావాట్ల విద్యుత్ ను ఇచ్చేందుకు కేంద్ర విద్యుత్ శాఖ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దాంతో పాటు ఎన్టీపీసీ, రైల్వేలైన్లకు బొగ్గు కేటాయించాలని కోరినట్టు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో ఈ ఉదయం విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ తో బాబు సమావేశమై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విద్యుత్ కు సంబంధించి కేంద్రం సాయం కోరామన్నారు. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్ల కోసం విద్యుత్ సంస్కరణలను ప్రారంభించామని... ఇళ్లు, వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరాకు పథకాలు రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదే సమయంలో విద్యుత్ విషయంలో తెలంగాణకు కూడా సాయం అందించాలని కోరానని, అందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని బాబు వెల్లడించారు.