: భారత్ లో మహిళల భద్రత గురించి అమెరికన్లలో ఆందోళన!
భారత్ లో మహిళలపై ఇటీవలి కాలంలో అత్యాచారాలు పెరిగిపోతుండడంతో అమెరికన్ నేతల్లో ఆందోళన తార స్థాయికి చేరినట్లుంది. ముఖ్యంగా యూపీలోని బదౌన్ లో ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసి, ఉరితీసిన ఘటనపై అక్కడి సెనేటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే జోక్యం చేసుకుని భారత్ తో చర్చలు జరపాలని అమెరికా ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళల భద్రతకు సంబంధించి భారత్ తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు తాము చర్చలు జరపుతున్నట్లు ఒబామా ప్రభుత్వంలో ఉన్నతాధికారి అయిన కేథరీన్ ఎం రస్సెల్ సెనేటర్లకు తెలిపారు. లింగ ఆధారిత హింసను నివారించేందుకు అమెరికా అనుభవాన్ని భారత్ తో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలని చెప్పారు.