: ఎస్సై సాక్షిగా ప్రేమికుడ్ని చితకబాది ప్రియురాలిని కిడ్నాప్ చేశారు


ప్రేమికులకు ఎస్కార్టుగా వచ్చిన ఎస్సై సాక్షిగా ప్రేమికుడిని చితకబాది, ప్రియురాలిని కిడ్నాప్ చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. కులాల కుమ్ములాటలు చోటుచేసుకునే తమిళనాడులో అవరైకుళం అంబలవానపురంకి చెందిన రాజదురై కుమారుడు శంకర్ (26) అల్ వాయ్ మొళిలో కాలేజీలో చదువుతున్నాడు. ఇతనికి కన్యాకుమారి జిల్లాలోని కులశేఖరన్ పుదూర్ కు చెందిన ఇసక్కియప్పన్ కుమార్తె గంగ (21)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

వీరి కులాలు వేరు కావడంతో గంగ తల్లిదండ్రులు వారి పెళ్లికి అభ్యంతరం చెప్పారు. దీంతో శంకర్, గంగ స్నేహితుల సాయంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. దీంతో గంగ తండ్రి ఇసక్కియప్పన్ తన కుమార్తెను వలలో వేసుకుని మాయ చేశారని, తక్షణం తన కుమార్తెను తనకు అప్పగించాలని కోరుతూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశం మేరకు సుశీంద్రం ఎస్సై జయంతి మద్రాసు హైకోర్టులో కొత్త దంపతులను హాజరుపరిచారు.

న్యాయమూర్తి ఎదుట గంగ తన భర్తతోనే జీవిస్తానని స్పష్టం చేసింది. దీంతో న్యాయస్థానం జయంతిని ఎస్కార్టుగా ఇచ్చి నాగర్ కోయిల్ కు పంపించారు. బస్సు తిరునల్వేలి సమీపంలోకి చేరుకోగానే మారణాయుధాలతో నలుగురు వ్యక్తులు బస్సును అటకాయించారు. బస్సెక్కి అందులోని ప్రేమికుడు శంకర్ ను చితక్కొట్టి గంగను కిడ్నాప్ చేశారు.

ఆ సమయంలో ఎస్సై, పోలీసు సిబ్బంది అదే బస్సులో ఉన్నప్పటికీ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించకపోవడం విశేషం. శంకర్ ను సహ ప్రయాణికులు ఆసుపత్రికి తరలించారు. శంకర్ ఫిర్యాదుతో ఎస్సై సహా నలుగురిపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News