: జీహెచ్ఎంసీ అధికారుల అత్యుత్సాహం... సక్రమంగా ఉన్నా కూల్చేశారు
హైదరాబాదులోని మాదాపూర్ లో గల గురుకుల్ ట్రస్టు భూముల్లో అక్రమంగా కట్టడాలు నిర్మించారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం నుంచి ఆదేశాలు అందగానే ప్రొక్లెయినర్లు, జేసీబీలతో గురుకుల్ ట్రస్టులోని అక్రమ నిర్మాణాల వద్దకు చేరుకుని కూల్చడం ప్రారంభించారు. తొలి రోజు కూల్చివేత పూర్తి కాకపోవడంతో రెండోరోజు కూడా కూల్చివేత కొనసాగించారు.
కూల్చివేతలో అన్ని అనుమతులు ఉన్న ఓ భవనాన్ని కూడా కూల్చి వేశారు. దీంతో భవన యజమాని ఆందోళనకు దిగాడు. భవన నిర్మాణానికి పొందిన అనుమతులు చూపించాడు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు జరిగిన తప్పు తెలుసుకుని నాలుక్కరుచుకున్నారు. భవన యజమానికి తప్పైపోయిందని చెప్పి నెమ్మదిగా జారుకోబోయారు. దీంతో కూల్చేసిన దాన్ని ఎవరు నిర్మిస్తారని భవన యజమాని నిలదీశారు.
అతనికి సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. దీనిపై స్థానికులు మండి పడుతున్నారు. నోటీసులు కూడా జారీ చేయకుండా కూల్చివేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఆ భవన యజమాని దీనిపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు.