: గంగలో ఒక్క మునకేస్తే చాలు..!
గంగా నది హైందవులకెంతో పవిత్రమైనది. హిందూ మతాచారాలను అనుసరించి ఈ నదిలో మునక పాపపరిహారం చేస్తుంది. అంతేగాకుండా గంగా జలం మోక్ష ప్రదాయని అని నమ్మిక. అలాంటి పవిత్ర నది కాస్తా ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా తయారైంది. ఇందులో ఒక్క మునకేస్తే చాలు క్యాన్సర్ కారక విషపదార్థాలను కోరి మరీ అంటించుకున్నట్టేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. భక్తులు నదీ తీరంలో పారవేసే ప్లాస్టిక్ వ్యర్థాలు ఏళ్ళ తరబడి పేరుకుపోయి ప్రాణాంతక విషపదార్థాలుగా రూపాంతరం చెందుతున్నాయని వారు తెలిపారు.
గతేడాది జరిగిన కుంభమేళా సందర్భంగా హైదరాబాదులోని నేషనల్ సెంటర్ ఫర్ కాంపోజిషనల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ మెటీరియల్స్ (ఎన్సీసీఎమ్) సంస్థ గంగా నది నీటి నుంచి కొన్ని నమూనాలను సేకరించింది. వాటిని ప్రయోగశాలల్లో పరిశీలించగా, ఆ నీటిలో క్రోమియం 6 ఉన్నట్టు తేలింది. ఇది విషపదార్థమని, అధికమోతాదులో శరీరంలో ప్రవేశిస్తే క్యాన్సర్ కారకమవుతుందని ఎన్సీసీఎమ్ అధిపతి డాక్టర్ సునీల్ జైకుమార్ తెలిపారు.